నిన్న రాత్రి ఎనినిమిదింటికి ఒక సమావేశంలో ఉండగా మాతోపాటు ఉన్న బాల్ రెడ్డి ఫోన్ మోగింది. అటువైపు ఉన్నది ఉస్మానియా విద్యార్ధులు. మెస్సును పోలీసులు మూసేయించారని దాదాపు 2000 మంది విద్యార్ధులు ఆకలితో ఉన్నారని. ఏదైనా సాయం చేయమని అభ్యర్ధన.
కొంచెం సమయం ఇవ్వమని చెప్పి బాల్ రెడ్డి ఫోన్ పెట్టేశాడు. క్యాటరింగ్ వ్యాపారం చేసే తన మిత్రుడైన అశోక్ కు ఫోన్ చేసి పరిస్థితి వివరించాడు. భోజనం ఏర్పాట్లు చేసేందుకు అశోక్ సంతోషంగా ఒప్పుకున్నాడు.
మేము సమావేశం ముగించుకుని రాత్రి పది గంటలకు ఉస్మానియా యూనివర్సిటీ చేరుకున్నాం. అదొక దుర్భేధ్యమైన కోటను తలపిస్తోంది. ముళ్లకంచెలు, ర్యాపిడ్ ఆక్షన్ ఫోర్స్, సి.ఐ.ఎస్.ఎఫ్, సి.ఆర్.పి.ఎఫ్ బలగాలు యూనివర్సిటీని దిగ్బంధం చేశాయి.
అక్కడి దృశ్యం ఎంతటి కరకు గుండెలనయినా కదిలించేది. ఆర్ట్స్ కాలేజి ముందు ఒక విద్యార్ధి సాగరం. దాదాపు రెండు వేల మంది విద్యార్ధులు….నిండా పాతికేళ్లు లేని రేపటి తరం ప్రతినిధులు…ఎముకలు కొరికే చలిలో, వరుసల్లో కూర్చుని, చేతుల్లో పళ్ళేలు పట్టుకుని అన్నం కోసం ఎదురుచూస్తూ…
ఏం అడిగారని వారికీ శిక్ష వేసింది ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం?
ఒక ప్రజాస్వామిక ఉద్యమాన్ని అణచడానికి ఎంతటి కౄర నిర్భంధకాండ!
ఒక వైపు మానవ హక్కుల కమీషన్, మరో వైపు హైకోర్టు ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లు, మెస్సులు మూసివేయొద్దని ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోని ప్రభుత్వాన్ని ఏమనాలి?
ఎందుకు తెలంగాణా విద్యార్ధులపై ఈ దమనకాండ?
ఎన్నాళ్లదీ స్వయంపాలనా పోరాటం?
ఎన్ని వేల బలిదానాలు చేసిందీ త్యాగాల గడ్డ
తరాలు మారినా మారని తలరాతలు ఇంకెన్నాళ్ళు?
ఎవరో పాటందుకున్నారు
ఎంత సందర్భోచితంగా ఉందా పాట.
ఒక పిల్లవాడు అడిగాడు నన్ను
“అన్నా ఆకలయితుంది….అన్నం ఎప్పుడస్తది?
“వస్తుంది తమ్మీ…చాలా మంది ఉన్నరు కదా. అందుకే కొంచెం టైం పడుతుంది” బదులిచ్చాను
“అన్నం లేటైతే పర్వాలేదు ఎదురుచూస్తం కానీ తెలంగాణ మాత్రం లేట్ కావొద్దు” అన్నడు పక్కన ఉన్న విద్యార్ధి
వారు వయసులో చిన్నవారే కావొచ్చు కానీ ఇవ్వాళ వారి పోరాట స్ఫూర్తి చూసి మొత్తం ప్రపంచం ముక్కున వేలేసుకుంటున్నది. వారి నిబద్ధతకు జడిసి ఎన్నడూ కలవని జెండాలు కూడా తెలంగాణ కొరకు ఒక్కటవుతున్నాయి.
ఎలా రాజుకుందీ పోరాట జ్వాల అని చాలామంది ఆశ్చర్యపోతున్నారివ్వాళ. ఇన్నాళ్లూ ఎక్కడ దాగిందీ ధర్మాగ్రహం అని నివ్వెరపోతున్నారు.
ఇక్కడి గాలిలో, ఇక్కడి మట్టిలో, ఇక్కడి నీటిలో ఉన్నది ఆ పోరాట స్ఫూర్తి. నైజాం నవాబుకు వ్యతిరేకంగా కదిలిన బాలదండు, 1969 తెలంగాణా పోరులో రాలిన ముక్కు పచ్చలారని వందలాది విద్యార్ధుల చైతన్యమే ఈనాటి తెలంగాణా పోరులోనూ ఆవిష్కృతమవుతోంది.
ఇంతలో ఫోన్ వచ్చింది. అన్నం తీసుకువస్తున్న వాహనాన్ని పోలీసులు ఆపారని, లోపలికి అనుమతించట్లేదని.
ఎక్కడయినా చూశారా విద్యార్ధులపై ఇటువంటి నిర్బంధాన్ని?
కనీసం అన్నం కూడా తిననీయని “ప్రజాస్వామ్య” ప్రభుత్వాన్ని?
మొదటినుండీ ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే పాలకులకు హడల్. 1969లో ఉద్యమానికి గుండెకాయలా నిలిచింది ఈ యూనివర్సిటీనే.
ఇక్కడ ఏదో ఒకటి చేసి ఉద్యమాన్ని అణిచివేస్తే మిగతా ప్రాంతాల్లో కూడా ఉద్యమం చల్లారిపోతుందని మన పాలకుల పిచ్చి నమ్మకం. అందుకే ఉస్మానియాపై ఈ ఉక్కుపాదం.
కొంతమంది విద్యార్ధులు వెళ్లి అన్నం తీసుకు వస్తున్న ఆ వాహనాన్ని ఇంకొక దారిలో ఆర్ట్స్ కాలేజీకి సమీపంలోని రోడ్డు దగ్గరికి తీసుకువచ్చారు. అక్కడి నుండి విద్యార్ధులు బేసిన్లలో, గిన్నెల్లో అన్నం, పప్పు మోసుకువచ్చి తమ సహచరులకి వడ్డించారు.
రాత్రి పన్నెండవుతుందేమో అప్పుడు. ఇంకా కొంత మంది విద్యార్ధులు అన్నం తింటుండగానే ఒకవైపు లాన్స్ లో కలకలం రేగింది. ఏమైందని అక్కడికి వెళ్లి చూస్తే ఒక యువకుడు ఒళ్లంతా గాయాలతో మూలుగుతున్నాడు. అతను ఇంజనీరింగ్ కాలేజి మెస్సులో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగి అట. ఏదో పనిమీద బయటికి వెళ్లి వస్తుంటే పోలీసులు పట్టుకుని పిచ్చిపట్టినట్టు కొట్టారు.
ఎవరో ఫోన్ చేస్తే పక్కనే ఉన్న 108 వాహనం వచ్చింది.
ఈ సంఘటనతో విద్యార్ధుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీస్ జులుం నశించాలనే నినాదాలతో యూనివర్సిటీ దద్దరిల్లింది. కొంతమంది యువకులు కోపావేశాలతో ఊగిపోయారు. పోలీసు క్యాంపువద్దకు ఊరేగింపుగా వెళ్దామని అన్నారు. ఇంతలో విద్యార్ధుల జే.ఏ.సి. నాయకులు అక్కడికి వచ్చారు. ఇది మనల్ని రెచ్చగొట్టి హింసని ప్రజ్వలింపజేయడానికి పోలీసులు చేసిన కుట్ర అని, ఇటువంటి కవ్వింపు చర్యలకు మనం లొంగవద్దని విద్యార్ధులకు నచ్చచెప్పారు. కాసేపటికి విద్యార్ధులు శాంతించారు.
మళ్లీ లాన్స్ లో బృందాలుగా విడిపోయి ఉద్యమ గీతాలు పాడటం మొదలు పెట్టారు పిల్లలు.
రాత్రి ఒంటిగంట అవుతుండగా మేము అక్కడినుంచి నిష్క్రమించాం.
ఉస్మానియాను ఒక్కసారి సందర్శిస్తే ప్రతి తెలంగాణా పౌరునికీ కొండంత ధైర్యం వస్తుంది. తెలంగాణ ఉద్యమ దీపాన్ని తమ రెండు చేతులూ అడ్డుగాపెట్టి కాపాడుకుని ఇప్పుడొక మహోజ్వల పోరాటానికి ఊపిరులూదిన ఆ యువకుల, యువతుల అసమాన త్యాగఫలమే రేపు సిద్ధించబోయే తెలంగాణ రాష్ట్రం.