అయితే రాజకీ య నాయకులు ప్రజల ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల మంత్రం జపిస్తున్నారు తెలంగాణ వాదంపేరుతో జరిగే పదవుల పందెం తెలంగాణను సాధించేది ఎలా అవుతుంది? చరిత్రాత్మక పాదయాత్ర నిర్వహించిన విద్యార్థులే నేడు పాలక పక్షాల కుట్రలను, తెలంగాణవాదం పేరుతో జరుగుతున్న అంతర్గత అంశాలను అర్థం చేసుకోవడం లేదు. పైగా ‘తెలంగాణ ప్రజా చైతన్య యాత్ర’ల పేరుతో ఎన్నికల ప్రచార కార్యకర్తలుగా, పోలింగ్ బూత్ ఏజెంట్లుగా మారుతున్నారు.
ఇదెంత విషాదకరం! తెలంగాణ ప్రజల నుంచి పోరాట చైతన్యం అలవర్చుకుంటే భవిష్యత్ ఉద్యమానికి మార్గగాములం కాగలమని తెలంగాణ యువత అర్థం చేసుకోవాలి. భవిష్యత్ తెలంగాణలో సమసమాజ స్థాపనకు, ప్రజాస్వామిక విలువల నిర్మాణానికి బాటలు వేయాల్సిన బాధ్యత తమపై ఉందని వారు గుర్తించాలి.
ఉద్యమం కోసం శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసినవారి పట్ల సానుభూతి ఉండడం సహజం. వారిని గెలిపించే బాధ్యతను ప్రజలపై బలవంతంగా ఎందుకు పెడుతున్నా రు? రాజీనామా చేసిన వారు ఎన్నికలలో ఓడిపోతే అని ఆలోచించే విద్యార్థులు, యువజనులు తమకు తాము ఒక ప్రశ్న వేసుకోవాలి. అసలు ఈ ఉప ఎన్నికలను ప్రజలు అంగీకరిస్తున్నారా?
ఉప ఎన్నికలను అనివార్యం చేయడం ద్వారా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కొత్తగా రుజువు చేసేదేమి టి? ప్రజలకు అనవసర ప్రయాస కల్గించి సాధించేదేమిటని ఆలోచించాల్సిన అవసరం లేదా? ఏ రాజకీయ పార్టీ నాయకులైనా ఒకటే కాదూ? ఆ పెద్దల ప్రయోజనాలకు మన పీడిత ప్రజల ప్రయోజనాలకు ఎన్నటికి పొసగదు. ఒకవేళ పొసిగిన ట్టు కన్పించినా అది తాత్కాలికమే. అటువంటప్పుడు విద్యార్థులు, బుద్ధిజీవులు, తెలంగాణ వాదులు పాలక పార్టీ ప్రభా వంలో కొట్టుకు పోకుండా స్వతంత్రంగా ఆలోచించాలి.
పెట్టుబడిదారులు, దొరల పార్టీలకు మనం పోలింగ్ బూత్ ఏజెంట్లం కాము, కారాదు. తెలంగాణ పోరాట స్ఫూర్తిని మనం ఎలుగెత్తాలి. ఉస్మానియా చౌరస్తాలో ఖణఖణమండే నిప్పుతో ప్రతిఘటించిన సిరిపురం యాదయ్య ఆశయం మనకు స్ఫూర్తి కావాలి. ఏ విద్యార్థి అమరుడూ ఉప ఎన్నికల్లో మన రాజీనామా వీరులను గెలిపించండని మరణ వాగ్మూ లం ఇవ్వలేదు.
పోరాటమే మార్గమని పోరాడి సాధించండని చివరి మాటలు చెప్పి ఈ తెలంగాణలో వెలుగు నింపుటకై కొవ్వొత్తుల్లా కరిగిపోయారు. వారి వారసులుగా మనం ఫలా నా గుర్తుకే ఓటు వేయండని లేదా ఫలానా వారిని ఓడించండని చెప్పడమా? అలా చెప్పడం అమర వీరుల త్యాగాలను వాడుకోవడం కాదూ? ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానపరచడమే.
తెలంగాణ సాధన కోసమే ఈ ఉప ఎన్నికలు అంటోన్న రాజకీయపక్షాలు కొన్ని ప్రశ్నలకు సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలి. ఇవిగో ఆ ప్రశ్నలు: ఉస్మానియా క్యాంపస్‌లో వేణుగోపాల్‌రెడ్డి మృతదేహంవద్ద ప్రమాణంచేసి కూడా తమ శాసన సభ్యత్వానికి రాజీనామా చేయని యర్రబెల్లి దయాకర్‌రావు, దామోదర్‌రెడ్డి ఆంధ్ర పాలకులకు అనుకూలంగా వ్యవహరించడం లేదా?
రాజీనామాలు చేయడంలో చేయి తిరిగిన కెసిఆర్ చెల్లని రాజీనామా ఎందుకు ఇచ్చినట్లు? రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలన్నప్పుడు టిఆర్ఎస్‌కు చెంది న ఇద్దరు ఎంపీలు తమ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా ఎందుకు చేయలేదు? ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని రాజకీయ జాక్ ఇంకా డిమాండ్ చేస్తూనే ఉన్నది. రాజీనామా చేయని ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయాలని కోరుతూనే, రాజీనామా చేసిన వారిని తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని జాక్ పిలుపు ఇస్తోంది!
అసలు రాజీనామాను కోరుతున్నది ఉద్యమాన్ని తీవ్రం చేసి తెలంగాణను సాధించడానికి కదా. మరి మళ్ళీ ఏకగ్రీవంగా ఎన్నుకునే కార్యక్రమం ఎవరి కోసం? అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సందర్భంగా ఈటెల రాజేందర్, ఇతర టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ వచ్చేవరకు ఎన్నికల్లో పాల్గొనమని స్పష్టం చేశారు.
మరి ఇప్పుడు ఉప ఎన్నికల్లో తాము గాక మరెవరూ పోటీచేయకూడదని అనడంలో ఔచిత్యం ఏమిటి? తమ తొలి వైఖరికి కట్టుబడి ఉన్నట్టయితే తెలంగాణ యువత టిఆర్ఎస్ వెనుక నిలబడి ఉండేది కాదా? రాజీనామా చేసిన వారు తిరిగి పోటీ చేయకుండా ఉండి, రాజీనామా చేయనివారిపై ఒత్తిడి తెచ్చి వారిని తమ మార్గంలోకి తీసుకొచ్చినట్టయితే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడేది కాదా? టిఆర్ఎస్ నాయకులు ఈ ప్రశ్నకు ఏం సమాధానం చెబుతారు? రాజీనామాలు అనేవి ఒక నిరసన రూపం. తద్వారా పాలకులపై ఒత్తిడి పెంచి క్రమంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపజేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం సాధ్యం అవుతుంది.
తెలంగాణ ఇచ్చేవరకు ఎన్నికలు జరపకుండా నిలువరించే సత్తా ప్రజలకు ఉంది. ఇప్పటికే రాజీనామా చేసినవారు మిన హా మరెవరూ రాజీనామా చేయడం లేదు కాబట్టి రాజీనామా చేసినవారిని మళ్ళీ ఎన్నుకోవాలనడం సబబైన వాదనేనా? ఇందు లో కనీస రాజకీయ నిబద్ధత ఉందా? విద్యార్థులు మంటల్లో కాలిపోతుంటే రాజీనామా చేసినవారికి సన్మానసభలా? ఇదెలాంటి పోరాట సంస్కృతి? వందలాది విద్యార్థులు, యువకులు తెలంగా ణ కోసం ఆత్మార్పణ చేసుకున్నా రు. నిస్వార్థంగా నిండు ప్రాణాల ను త్యాగం చేశారు.
మరి తెలంగా ణ నినాదంతో పదవులు పొందినవారు ఆ పదవులను ఒక విస్పష్ట లక్ష్య సాధన కోసం త్యాగం చేయలేరా? తెలంగాణ వచ్చేదాక పదవులు లేకుండా మనలేరా? ప్రాణత్యాగాల కన్నా పదవులకు రాజీనామా గొప్పా? రాజీనామా చేసినవారిలో ఏ కొద్దిపాటి నిజాయితీ ఉన్నా తెలంగాణ వచ్చే దాక ఎన్నికల్లో పోటీ చేయమన్న వైఖరికి కట్టుబడి ఉండేవారని మేము భావిస్తున్నాం.
తెలంగాణ ప్రజ ల అభీష్ఠాన్ని అందరూ శిరసావహించవల్సిందే. రాజకీయ నాయకుల చట్రం నుంచి బయటపడిన తెలంగాణ, మళ్ళీ అదే చట్రంలో ఇరుక్కోకూడదు. ముఖ్యంగా విద్యార్థి లోకం తన సాహసోపేత ఉద్యమంతో తెలంగాణ లక్ష్య సాధనలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. రాజకీయ నాయకుల చేతిలో ఏ విధంగాను ఎవ్వరం కీలుబొమ్మలం కానప్పు డే ప్రజాస్వామిక తెలంగాణ సాధ్యమవుతుంది.
విద్యార్థుల ఆత్మార్పణలకు తల్లడిల్లిపోయిన నాయకులు ఉద్యమంలో పాల్గొంటున్న ఇతర విద్యార్థులపై పోలీసులు బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయించారా? ఎత్తివేయాలనే షరతు విధించకుండానే గత జనవరి 5న కేంద్ర ప్రభు త్వంతో చర్చలకు న్యూఢిల్లీకి ఎలా వెళ్ళారు? ఆ చర్చల ఎజెం డా ఏమిటో ప్రకటించనే లేదు. చర్చల సారాంశమేమిటో ప్రజలకు తెలియలేదు.
అయినప్పటికీ శాంతి పత్రంపై టిఆర్ఎస్ తో సహా అన్ని రాజకీయపక్షాలు సంతకాలు చేశాయి. హింస చేస్తున్నదెవరు? శాంతి పాటించాల్సిందెవరు? ఇదంతా రాజకీయ పార్టీలు తాము కోల్పోయిన చొరవను ప్రజల నుంచి తీసుకోవడం కోసం ఆడిన నాటకం కాదా? ఇందులో భాగంగానే శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటయింది. ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చాయి.
తెలంగాణ ప్రజల చైతన్యాన్ని ముఖ్యంగా విద్యార్థుల పోరాడే తత్వాన్ని దారి మళ్ళించిన కుట్ర ఫలితమే ఈ ఉప ఎన్నికలు. ‘మా ఆకాంక్షను గుర్తించకుండా ద్రోహం తలపెడితే సోనియా గాంధీ బొమ్మనే కాదు, కెసిఆర్‌ను అయినా వదలమని గత నవంబర్ 30న విద్యార్థులు చేసిన హెచ్చరికలు పాలక వర్గాల గుండెల్లో భవిష్యత్ పరిణామాల విషయ మై ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. అందుకే నిస్వార్థ తెలంగాణ ప్రజా సైనికులను విద్యార్థులను పోరాట పథం నుంచి మళ్ళించి ఎన్నికల ప్రచారకులుగా, పోలింగ్ బూత్ ఏజెంట్లుగా తయారు చేస్తున్నారు.
పోలీసు తుపాకులకు ఎదురుగా నిలబడి కలబడినవారు, పది రోజుల్లో తెలంగాణ ప్రకటన ఇప్పించినవాళ్ళు విద్యార్థు లే. ఉప ఎన్నికల్లో అయినా, ఏ ఎన్నికల్లో అయినా గెలుపోటములతో తెలంగాణ ప్రజల ఆకాంక్షకు సంబంధం లేదు. ఉద్య మ తెలంగాణ ద్వారా మాత్రమే ఆ ఆకాంక్ష సాకారం కాగలదు. ఈ వాస్తవాన్ని చాటి చెప్పాల్సిన బాధ్యత విద్యార్థులదే.
- దేవులపల్లి కోటేష్, గుర్రం సీతారాములు (English and Foreign Languages University,
Hyderabad); చంద్రయ్య, హరినాథ్ (H C U Hyd ), స్టాలిన్ (Komaram Bheem Telugu University) జగన్, బాలలక్ష్మి, మణి (O U ) వలి ఉల్లాఖాద్రీ, మహేష్, రాజేష్ (K U Warangal ) రమేష్ (T V V ), సుధాకర్ (M G University Nalgonda ) అక్కపల్లి సాంబమూర్తి (Saatavahana University, )